...

...

31, జులై 2010, శనివారం

కవితాభిషేకం! - 26


శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిన్ దత్కమలా సమీపమున బ్రీతి న్నిల్పినాడో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోచుఁ రా
జీవాక్షుండు కృతార్థుఁజేయు శుభదృష్టిం కృష్ణరాయాధిపున్.

ఉల్లమునందు నక్కటిక మూనుట మీ కులమందుఁగంటి మం
చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేఁత నవ్వు సం
ధిల్లఁ గిరీటిఁ బాశుపత్ దివ్య శరాఢ్యునిఁ జేయు శాంబరీ
భిల్లుఁడు కృష్ణరాయల కభీష్ట శుభ ప్రతిపాది గావుతన్.

ఉదయాచలేంద్రంబు మొదలు నెవ్వని కుమా
          రతకు క్రౌంచాచల రాజమయ్యె
నా వాడపతి శకంధర సింధురాధ్యక్షు
          లరిగాఁవు లెవ్వాని ఖరతరాసి
కాపంచగౌడ ధాత్రీపదం బెవ్వాని
          కసి వాఱుగా నేఁగునట్టబయలు
సకల యాచక జనాశాపూర్తి కెవ్వాని
          ఘన భుజాదండంబు కల్ప శాఖి

ప్రబల ’రాజాధిరాజ’ ’వీరప్రతాప’
’రాజపరమేశ’ బిరుద బిభ్రాజి యెవ్వఁ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు
డొక్కనాడు కుతూహలం బుప్పతిల్ల

భువన విజయాఖ్య సంస
ద్భవన స్థిత భద్రపీఠిఁ ప్రాజ్ఞుల గోష్ఠిన్
కవితామధురిమ డెందము
దవులన్ గొలువుండి సదయితన్ ననుఁ బల్కెన్.

సప్త సంతానములలోఁ ప్రశస్తి గాంచి
ఖిలముగా కుండునది ధాత్రి కృతియ కాన
కృతి రచింపుము మాకు శిరీష కుసుమ
పేశల సుధామయోక్తులఁ పెద్దనార్య!  

శ్రీఖండ శీతనగ మ
ధ్యాఖండ క్షోణి మండలాఖండల! వి
ద్యాఖేలన భోజ! సుధీ
లేఖద్రుమ! కృష్ణరాయ! లీలామదనా!

శ్రీవేంకటేశ పదప
ద్మావేశిత సదయహృదయ! హరినిటల నట
త్పావక పరిభావి మహః
ప్రావృత నిఖిలాశ! కృష్ణరాయ మహీశా!

హిందూరాజ్య రమాధురంధర! భుజాహిగ్రామణీ కంచుక
త్కుంద స్వచ్ఛయశోగుళుచ్ఛ! యవనక్షోణీధవస్థాపనా
మందీభూత కృపాకటాక్ష! యసకృన్మాద్యత్కళింగాంగనా
బందీగ్రాహ విగాహితోత్తర కుకుబ్దాటీ సమాటీకనా!
        
                                             - అల్లసాని పెద్దన 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి