ఉ. ఏపునఁ గృష్ణరాయ జగదీశ్వరు ఖడ్గము మింట మార్గముం
జూపిన భానుమండలము సొచ్చి హుటాహుటి శత్రులేఁగుచో
రేపటి బాపనయ్య పగలింటి మహోగ్రపు జంగమయ్య యో
మాపటి దాసరయ్య మము మన్ననసేయు మటందురెంతయున్
ఉ. కాశియు నీకరాసి సరిగాదు నృసింహుని కృష్ణరాయ! యా
కాశిని జచ్చు వారికిని గల్గును జేతికిఁ బుఱ్ఱె నీ మహో
గ్రాసిని గండతుండెములుగా మృతిఁబొందిన వైరికోటికిన్
భాసుర రంభకుంభ కుచ భారములబ్బెడు నేమి చిత్రమో!
ఉ. రాయగ్రామణి కృష్ణరాయ! భవదుగ్ర క్రూరఖడ్గాహిచేఁ
గాయం బూడ్చి కళింగ దేశ నృపతుల్ కానిర్ఝరీపోషణీ
మాయాభీకుముటూరులోటుకుహుటూమాయాసటాజాహరే
మాయాగ్గేయమడే యటండ్రు దివి రంభాజారునిన్ యక్షునిన్
మ. సమరక్షోణిని గృష్ణరాయల భుజాశాతాసిచేఁ బడ్డ దు
ర్దమదోర్దండ పుళిందకోటి యవనవ్రాతంబు సప్తాశ్వ మా
ర్గమునన్ గాంచి నెబా హరి హరంగా ఖూబుఘోడాకితే
తూముకీబాయిలబాయిదే మలికియందుర్మింటికి బోవుచున్
మ. గనఁకుల్ బల్లిదమయ్యె ఢిల్లికిని మక్కాకోట మేలయ్యెఁబం
డవకుం గ్రొత్తగఁగ్రొత్త డంబములమరెన్ బోలేరు చందేరులన్
దవసంబెక్కె బెడంద కోట పురకాంతాగర్భ నిర్భేద స
ప్రవణంబై నభవత్ప్రయాణ జయవార్తన్ గృష్ణరాయాధిపా.
- చాటువులు
1 కామెంట్:
chala chala manchi padyaalu, nice anDi
కామెంట్‌ను పోస్ట్ చేయండి