...

...

8, జులై 2010, గురువారం

కవితాభిషేకం ! - 4


మ. కలనం దావక ఖడ్గఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మం
    డల భేదం బొనరించి యేఁగునెడఁ దన్మధ్యంబునన్ హార కుం
    డల కేయూర కిరీటి భూషితుని శ్రీనారాయణునింగాంచి లోఁ
    గలఁగం బాఱుచు నేఁగె నీవ యను శంకన్ గృష్ణ రాయాధిపా!

కం. నరసింహ కృష్ణరాయని
     కర మరుదగు కీర్తియొప్పెఁ గరిభిద్గిరిభి
     త్కరి కరిభిద్గిరి గిరిభి
     త్కరి భిద్గిరిభిత్తురంగ కమనీయంబై. 
( ఈ పద్యం తెలుగు సాహిత్యంలో ఆణిముత్యంగా ఎన్నదగినది. కృష్ణ దేవరాయల కీర్తి ఎంత స్వచ్ఛమైనదో ఎంతటి కమనీయమైన తెల్లదనం కలదో చెప్తూ అతి తెల్లవైన వాటితో ఆ సత్కీర్తిని పోల్చాడు కవి. నరసింహ కృష్ణరాయలు అంటే తుళువ నరసింహరాయల కుమారుడైన కృష్ణరాయలు అని అర్థం. ఆ కాలంలో దక్షిణ భారత దేశంలో  ప్రతివారు తమ పేరు ముందు తండ్రి పేరును జోడించడం అలవాటుగా ఉంది. అతి తెల్లనైన కృష్ణరాయల కీర్తితో ఆరు అంశాల సామ్యాన్ని కల్పించాడు రామకృష్ణుడు.
కరిభిత్: ఏనుగును చంపినవాడు అంటే గజాసురుని చంపిన శివుడు. పురాణాల ప్రకారం శివుడు తెల్లనైన వాడు.
గిరిభిత్‍కరి: గిరిభిత్ అంటే ఇంద్రుడు. గిరుల రెక్కలను తన వజ్రాయుధంతో ఛేదించిన ఇంద్రుణ్ణి గిరిభిత్ అన్నారు. గిరిభిత్ కరి అంటే ఇంద్రుని ఏనుగు ఐరావతం. ఇది అతి తెల్లనైనది.
కరిభిత్‍గిరి: గజాసుర దమనుడైన శివుని కొండ. హిమాలయాలలోని కైలాసగిరి. మంచుతో కప్పబడి ఎప్పుడూ తెల్లగా ఉంటుంది.
గిరిభిత్: పర్వతాల్ని ఛేదించిన ఇంద్రుని వజ్రాయుధం
కరిభిద్గిరిభిత్తురంగ: ఇక్కడ కరిభిత్, గిరిభిత్  ఈ రెండు శబ్దాలకు తురంగ శబ్దాన్ని వేర్వేరుగా జోడించి కరిభిత్తురంగ మరియు గిరిభిత్తురంగ అని మనం అన్వయార్థం చెప్పుకోవాలి. 
కరిభిత్తురంగ అన్న శబ్దంలో తురంగము అంటే వాహనము అని అర్థం. కరిభిత్(శివుని) తురంగము అంటే శివుని వాహనమైన తెల్లనైన నందీశ్వరుడు.
గిరిభిత్(ఇంద్రుని) తురంగ అంటే ఇంద్రుని గుర్రమైన ఉచ్చైశ్రవము. అతి తెల్లనైనది.
ఇలా కృష్ణరాయల కీర్తి అత్యంత తెల్లగా కమనీయమై ఒప్పింది అని భావం. )  
                                                                                                      - తెనాలి రామకృష్ణుడు.


కామెంట్‌లు లేవు: